ఇలువేలుపు వెంకమ్మ పేరంటాలు ఆశీస్సులతో




జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం|
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీయ ముపాస్మహే||



భావి అవధానవిద్యావతంసులకు శుభస్వాగతం.........!

శ్రీమదాంధ్ర సంప్రదాయ సాహిత్య సరస్వతి – కవితా ప్రపంచ జిజ్ఞాసువులకు అందించిన అపురూపమైన కానుక “అవధానవిద్య”. సృజనాత్మక ప్రక్రియల్లో పేరెన్నిక గన్నదీ అవధానం. ఇది “ఆంధ్రుల సొత్తు” అని గర్వంగా చెప్పుకోదగ్గ వారసత్వసంపద. పద్యవిద్యే ప్రాణంగా, ఆశుకవిత్వమే భూమికగా, చమత్కార సహితంగా సమస్య మొదలు వివిధాంశాల పూరణలతో, ఆశ్యర్యపరిచే ధారణతో… తరతరాలుగా తెలుగు నేలను, తెలుగు జాతిని ఆనందపరవశుల్ని చేస్తున్న కళారాజం ఈ అవధానం. “వందమందిలో ఒక కవి ఉదయిస్తే, అలాంటి వెయ్యిమంది కవులలో ఒక్క ’అవధాని’ ఉదయిస్తాడు” అనే నానుడి అవధానవిద్యా ప్రాధాన్యాన్ని, ప్రత్యేకతను తెలియజేస్తోంది.

వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న, ఆసక్తులైన తెలుగువారంతా తెలుగు పద్యప్రాభవాన్ని, ఆశుకవితా విన్యాసాన్ని, అవధాన విద్యావైభవాన్ని చవిచూసేందుకు, నిపుణులైన శతావధానుల మార్గదర్శనంలో సంప్రదాయ పద్దతిలో “అంతర్జాల మాధ్యమం”లో క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు, అవధాన విద్యా సారస్వత ఉపాసనలో స్వయంగా అనుభూతిని పొందేందుకు ఇది ఒక సువర్ణావకాశం. తెలుగు భాషాసాహిత్యాలను, అవధానకళను ఆరాధించే ఉత్సాహవంతులైన అభ్యాసకులందరినీ భావి పద్యకవులుగా, అవధాన విద్యావతంసులుగా తీర్చిదిద్దేందుకే రూపొందించిన సమగ్రమైన కోర్సు – “అవధాన విద్య”.

శతావధాని డా. రాంభట్ల పార్వతీశ్వరశర్మగారు నిర్వహిస్తున్న పద్యవిద్య - అవధానవిద్య తరగతులపై ఆసక్తి ఉన్న వారు ఈ క్రింది విషయాలను గమనించండి.

1) తెలుగు ధారాళంగా చదవగిలిగి, రాయగలిగి, మాట్లాడగలిగి ఉండడమే అర్హత.   మరే ఇతర అర్హతలు ఈ తరగతులకు అవసరం లేదు. ఛందస్సు గురించి మొదటిరోజుకు ముందు అవగాహన ఉంటే మంచిది.

2) ఈ విద్య నేర్చుకోవడానికి విద్యార్ధులందరూ తప్పనిసరిగా అన్ని తరగతులూ హాజరు కావాలి.

3) రానివారి కోసం తరగతి మళ్ళీ తీసుకోబడదు.

4) మెటీరియల్ అంటూ ప్రత్యేకంగా ఉండదు. ఆశువు, ధారణ సాధన చేయించడమే లక్ష్యం. ఎవరికి వారు "నోట్స్" రాసుకోదలచుకుంటే సమ్మతమే.

5) వారమునకు గంట - గంటన్నర చొప్పున, విన్యాసానికి ఆరేసి నెలల చొప్పున, ప్రాథమవిన్యాసమునకు 24 వారములు, మధ్యమవిన్యాసమునకు 24 వారములు, ప్రౌఢవిన్యాసమునకు 24 వారములు. ఏదైనా కారణాన ఒక వారం క్లాసు జరగకపోతే దాన్ని మరువారం అవధాని పూర్తి చేస్తారు. కాబట్టి 24 వారాలు దాటొచ్చు.

6) ఈ కోర్సు ఏడాదిన్నరపాటు ప్రతీ ఆదివారం Zoom వేదికగా ప్రత్యక్ష తరగతుల రూపంలో జరుగుతుంది. (కొన్నివారాలు మనకు "అతిథులుగా" లబ్దప్రతిష్టులైన ఎంతోమంది ఇతర అవధానులు విచ్చేసి మరిన్ని పాఠాలు, మెళకువలు పంచుకుంటారు.)

7) ఈ ఏడాదిలో విద్యార్థుల విజ్ఞాన ప్రదర్శనకు "వ్యాలీవేదిక" తగినన్ని అవకాశాలు కల్పిస్తుంది.

8) ఈ విద్యకు సంబంధించిన అన్ని ప్రశ్నోత్తరాలూ తరగతి గదిలోనో, నిర్దేశించిన వేళలోనో, avadhanavidya.com అభ్యాసవేదిక మీదా జరగాలి. అవధానులను సమయాసమయాలు చూడకుండా సందేశాలతో ఇబ్బంది పెట్టవద్దు.

9) తరగతులు హాజరు కాదలచుకున్నవారు వాట్సాప్ చెయ్యడానికి వీలైన చరవాణి నెంబరును పంచుకోగలరు.

10) తదితర వివరాలు తెలుసుకోవాలంటే.. ఆసక్తి ఉన్నవారు (+1)408 504541 నెంబరుకు వాట్సాప్ చెయ్యగలరు. లేదా valleyvedika@gmail.com ఈ మెయిల్ ద్వారా సంప్రదించగలరు.


కవి యద్యవధానీ స్యాత్ సంపాద్యం “ధ” చతుష్టయం|
ధైర్యం ధారా ధోరణీచ ధారణాచ సునిశ్చలా ||